రజాకార్ అంటే వలంటీర్ అని అర్థం. క్షేత్రస్థాయిలో 30 మంది రజాకార్లకు సలార్ అనే నాయకుడు ఉంటాడు. తాలుకా స్థాయిలో సలార్–ఇ– సగీర్, జిల్లా స్థాయిలో సలార్–ఇ– కబీర్, కేంద్ర స్థాయిలో రజాకార్ నాయకుడు – అప్సర్ –ఇ– అలా అని పిలిచేవారు.
రజాకార్ వ్యవస్థను నియంత్రించడానికి ఏడుగురు సభ్యుల బోర్డు ఉండేది. వీరికి దీన్ యార్జంగ్ శిక్షణ ఇచ్చాడు. యూనిఫాంగా ఖాకీ చొక్కా, ఖాకీ పాయింట్, నల్ల టోపీ ఉండేది. 1946లో ఖాసీం రజ్వీ ఎంఐఎం అధ్యక్షుడయ్యాడు. ఇతను రజాకార్ల సంఖ్యను 50 వేలకు పెంచాడు. త్వరలోనే ఈ సంఖ్యను 5 లక్షలకు పెంచుతానని ప్రకటించాడు. హైదరాబాద్లో అసఫ్ జాహీల పాలన కొనసాగితేనే తన మనుగడ ఉంటుందని భావించిన ఖాసీం రజ్వీ నిజాం వ్యతిరేకులైన వారిపై దాడులు చేసి వారిని హతమార్చేవాడు.
హైదరాబాద్లో ముస్లింల పాలన శాశ్వతంగా కొనసాగాలని రజ్వీ భావించేవాడు. హైదరాబాద్ సంస్థానంలో 1946–48 మధ్యకాలంలో రజాకర్ల దాడులు అధికమయ్యాయి. ఆపరేషన్ పోలో తర్వాత హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. ఖాసీం రజ్వీని అరెస్టు చేసి పుణెలోని ఎర్రవాడ జైలు తరలించారు. 1957లో ఖాసీం రజ్వీ ఎర్రవాడ జైలు నుంచి విడుదలై పాకిస్తాన్కు వెళ్లిపోయాడు. పాకిస్తాన్కు వెళ్తూ ఎంఐఎం బాధ్యతలను అబ్దుల్ వాహిద్ ఓవైసీకి అప్పగించాడు.
